Home » » సౌప్తిక పర్వము: ప్రథమాశ్వాసము

సౌప్తిక పర్వము: ప్రథమాశ్వాసము

 


వైశంపాయనుడు జమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు సత్రయాగం జరుగుతున్న సమయంలో సూతుడు అను పౌరాణికుడు శౌనకాది మహా మునులకు ఈ విదంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు సంజయా ! రధికత్రయం నా కుమారుడి వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు. ఏమి చేసారు అని అడిగాడు. 

సంజయుడు మహారాజా ! అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన రధికత్రయం దక్షిణం దిక్కుగా ఉన్న పాండవశిబిరాల వైపు వెళ్ళారు. 

ఆ సమయంలో పాండవశిబిరాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషాంబుధిలో తేలియాడుతున్నారు. 

ఆ సమయంలో అక్కడకు వెళితే వారి చేతిలో చావు తప్పదని రధిక త్రయం అక్కడినుండి తూర్పు దిక్కుగా వెళ్ళి కొంతదూరం వెళ్ళి ఒక కొలను వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గర తమ రధములు ఆపారు. సాయం సంధ్యా కార్య క్రమాలు ముగించుకుని వారు ముగ్గురూ భూమి మీద శయ్యలు ఏర్పాటు చేసి మేను వాల్చారు.

కాకులు గుడ్లగూబలు:

కృపాచార్యుడు నిద్రపోయినా అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ చెట్టు మీద వాలింది. 

మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్ళను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికింది, మరికొన్నిటిని కాళ్ళు చేతులు విరిచింది, కొన్నింటి పొట్టలు చీల్చింది, మరికొన్నింటి రెక్కలు విరిచింది ఆ ప్రకారం ఆ ఉలూకము నిద్రిస్తున్న కాకులను అతి వేగంగా చంపింది. ఇది చూసిన అశ్వత్థామకు తళుక్కున ఒక మెరుపు మెరిసింది. 

నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలూకము నాకు ఉపదేశం ఇచ్చింది. నేను కూడా ఈ విధంగా నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను, బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. 

నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమ వంతులైన వారందరిని సంహరించ లేను. అది మంచిది కాదు. ఏమాత్రం సంశయించక పాడవ శిబిరంలో ప్రవేశించి ఆదమరచి నిద్రపోవు పాండవులను వారి పుత్రులను ఈరోజే బంధుమిత్ర సహితంగా తుదముట్టిస్తాను. 

రారాజు బొందిలో ప్రాణముడగానే పాండవులు ఏడవడం చూసిన రారాజు సంతోషంగా కన్నుమూస్తాడు. ఈ సమయంలో ధర్మాధర్మ విచక్షణ పనికి రాదు. శత్రువును ధర్మాధర్మ విచక్షణ కంటే ఉపాయమే ముఖ్యము అది శాస్త్రములు అంగీకరిస్తున్నాయి. 

శత్రురాజుల మీద దండెత్తినపుడు, శత్రురాజులు విడిది చేసినపుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళుతున్న సమయాన, శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదని శాస్త్రం చెప్తున్నదని పెద్దలు చెప్తారు కదా ! పైగా నేను క్షాత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు దోషం కాదు. 

పాడవులు భీష్ముని, కర్ణుడిని, ద్రోణుడిని పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా ! వారు అధర్మం పాటించినపుడు నేను అధర్మంగా నడచుకున్న ఏమి దోషం. కనుక కల్మషహృదయులగు పాండవులను వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతే కాని నిందార్హం కాదు అంటూ తనలో తాను నిశ్చయించుకున్నాడు.

అశ్వత్థామ తన నిశ్చయమును కృపాచార్యునకు వినిపించుట:

అశ్వత్థామ తననిశ్చయమును చెప్పడానికి కృపాచార్య, కృతవర్మలను లేపి మిత్రమా కృతవర్మా ! మామా కృపాచార్యా ! రారాజును ఒక్కడిని చేసి ఆ పాడవులు సుయోధనుడిని అధర్మంగా కూల్చాడు. 

పదకొండు అక్షౌహినుల సైన్యములకు అధిపతి అయిన సుయోధనుడు దీనుడై నేల పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండీ సుయోధనుడు దిక్కు లేని వాడు అయ్యాడు. మనమిప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి అన్నాడు.

కృపాచార్యుడు అశ్వత్థామకు ధర్మాధర్మములు చెప్పుట:

కృపాచార్యుడు అశ్వత్థామా ! నీమసులో మాట చెపితే విని మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను. ఏ పనికైనా పురుష ప్రయత్నము, దైవసహాయం కావాలి. ఏ ఒక్కదానితో కార్యము సానుకూలము కాదు. 

దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా రైతు విత్తనదే మొలకెత్తదు కదా ! అలాగే రైతు విత్తినా దైవం అనుకూలించి వర్షం కురిపించకున్న మొలకెత్తి ఫలితాన్ని ఇవ్వదు. కనుక పురుష ప్రయత్జ్ఞం, దైవసాయం రెండూ చేరి కార్యసానుకూలతను ఇస్తాయి. 

ధర్మం తప్పక చేసే ఏపనికైనా దైవసాయము ఉంటుంది. కనుక కార్యం సానుకూలమౌతుంది. అధర్మంతో చేయు పనులు ప్రారంభంలో సుఖములు ఇచ్చినా తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. 

సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో ద్రౌపదిని సభకీడ్చి అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి. 

మూందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడికి గాంధారికి విషయం చెప్పి వారు ఏమి చెప్పిన అది చేస్తాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం ఔతుంది కాని ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అన్నాడు. 

అశ్వత్థామ శపధం:

అశ్వత్థామ కృపాచార్యునితో మామా ! ధర్మం దేశకాల పరిస్తితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది ధనవంతుడుగా అధర్మం ఔతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. 

నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను. క్షాత్రం అవలంబించాను. ఇంత కాలం తరువాత మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం నాకు చేత కాదు. అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను. 

ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి ఆనందంగా అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. 

పైగా మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి భూతములకు ఆహారంగా వేస్తాను. 

నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా గజాశ్వకళేబరాలతో పడి ఉండటం నేను కళ్ళార చూడాలి అన్నాడు అశ్వత్థామ. అంతా శాంతంగా విన్న కృపాచార్యుడు అశ్వత్థామా ! నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంబిస్తున్నావు. 

దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిస్తాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిన నిలిచిన నిన్ను గెలువగల వారు ఎవ్వరు.

 ఇక నాగురించి చెప్పపని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని వారిని చంపుట లేక వారి చేతిలో మడయుట ఏదో ఒకటి నిశ్చయం అన్నాడు కృపాచార్యుడు.

అశ్వత్థామ కృపాచార్యుని ప్రతిపాదన నిరాకరించుట:

అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. ఈలోకంలో కోపంలో ఉన్న వాడికి, ధనసంపాదనా వ్యామోహికీ, వ్యాధిగ్రస్తుడికి, కామాతురతతో కన్ను మూసుకు పోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది. 

నా తండ్రి మరణాన్ని తలచుకొని దహించుకు పోతున్న నా హృదయాన్ని శత్రుసంహారంతో ఆర్పి నా స్వామి సుయోధనుడి ఋణం తీర్చుకుంటాను. అంత వరకు నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటాడు కనుక ఎదిరించ లేము. 

కనుక రాత్రి సమయంలోనే శత్రుసంహారం చేస్తాను . దయచేసి నన్ను వారించకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధు మిత్రులు, సైనికులు గాఢనిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆతరువాత ఆ విషయం రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను అన్నాడు.

కృపాచార్యుడు అశ్వత్థామని నివారించడానికి ప్రయత్నించుట:

అశ్వత్థామ మాటలను విని కృపాచార్యుడు అశ్వత్థామా ! కోపంతో ఉన్న వాడికి కార్యాకార్య విచక్షణ తెలియదు. ప్రస్థుతం నీవు ఆ స్థితిలో ఉన్నావు. 

ధర్మాధర్మములు ఎరుగక ఉన్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మమార్గాన నడిచిన నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచిన వాడిని, జుట్టు ముడివీడిపడిన వాడిని వాహనవైకల్యమును పొందిన వాడిని, శరణుజొచ్చిన వాడిని వధించుట ధర్మం కాదు. 

పాండవులు వారి సమస్తసైన్యము, పాంచాలురు గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రించినవాడు చచ్చినవాడితో సమానం. చచ్చినవాడిని మీదపడి చంపి నరకముకు ఏల పోయేవు. మహాస్త్రకోవిదుడవు, 

మహారధులలో ప్రధముడవు, అలాంటి నీవు ఇలాంటి నీచ కార్యముకు ఒడబడతావా ! కనుక రేపు యుద్ధములో మనం పాండువీరులతో పోరు సల్పుతాము అన్నాడు.

అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను అంగీకరింపచేయుట:

అశ్వత్థామ మామా ! కృపాచార్యా ! నీవు పెద్ద వాడవు నన్ను శాసించ తగిన వాడవు. నీవు చెప్పింది సత్యము కాని నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పంచాల రాకుమారుడు ధృష్టద్యుమ్నుడు అది పాతకము అని తలపక నా తండ్రి జుట్టు పట్టుకుని తల నరికాడు. 

శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముని పడగొట్టాడు. భూమిలో దిగిన రధచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భూరిశ్రవసుడిని భుజములు నరికినందుకు అతడు ప్రాయోపవేశం చేసాడు. 

ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవసుడిని సాత్యకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు ఎక్కడో మడుగులో దాగిన సుయోధనుడిని బయటకు రప్పించి భీముని చేత అధర్మయుద్ధమున కూలత్రోయించారు. ఇన్ని విధముల యుద్ధధర్మాన్ని మీరి యుద్ధధర్మమనే వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పుట న్యాయమా ! అన్నాడు. 

మామా ! తొడలు విరిగి నేలమీద ఉన్న సుయోధనుడు దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలుగ లేదా ! అందుకనే నేను చేసేది అధర్మమైనా అధర్మమార్గాన నా తడ్రిని చంపిన ధృష్టద్యుమ్నిడిని నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. 

ఇందు వలన నేను కీటకంగా జన్మించినా బాధపడను అని అంటూనే రథం ఎక్కాడు అశ్వత్థామ. అశ్వత్థామా ! నువ్వూ నేను కృతవర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయాన నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేనూ నీతో వస్తాను అన్నాడు కృపాచార్యుడు. 

అశ్వత్థామ మామా ! చాలా సంతోషం నా తండ్రిని చంపిన వాడిని చంపడానికి వెళుతున్న నాకు మీరు తోడుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది రండి అన్నాడు.

అశ్వత్థామకు భూతం ఎదురు వచ్చుట:

రధికత్రయం పాండవశిబిరాల వైపు వేగంగా కదినారు. అశ్వత్థామ అతి వేగంగా తన రధమును నడుపసాగాడు. కృతవర్మ, కృపాచార్యులు కొంచం వెనుక పడ్డారు. అప్పుడు ఒక భూతం అశ్వత్థామ ఎదుట నిలిచింది. అశ్వత్థామ ఆ భూతానికి బెదరక దాని మీద అస్త్రప్రయోగం చేసాడు. 

వాటిని అన్నింటిని ఆ భూతం నోరు తెరచి మింగింది. అశ్వత్థామ వద్ద ఉన్న అస్త్రములు అన్నీ అయిపోయాయి. అశ్వత్థామకు ఏమీ చేయాలో తోచక కత్తి తీసుకుని ఆ భూతమును ఎదుర్కొన్నాడు. ఆ కత్తి ఆభూతమును తాకగానే మాడిపోయింది. 

అశ్వత్థామ తన వద్ద ఉన్న తోమరములు, చక్రాయుధములను ఆ భూతము మీదకు విసిరాడు. అవన్నీ ఆభూతమునకు తాకగానే తునాతునకలు అయ్యాయి. అశ్వత్థామ తన గధను ఆ భూతము మీదకు విసిరాడు. ఆ భూతం ఆ గధను మింగింది. వెనకకు తిరిగి చూసాడు కృతవర్మ, కృపాచార్యుడు కను చూపు మేరలో లేరు. 

కృపాచార్యుడి మాట వినక ముందుకు దూకినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అని చింతించాడు. గోవులను, బ్రాహ్మణులను, బాలురను, వృద్ధులను, అంధులను, మిత్రులను, సఖులను, తోబుట్టువులను, జడులను, ఏమరుపాటున ఉన్న వారిని, నిద్రిస్తున్న వారిని, ఆడువారిని అస్త్రశస్త్రములతో కొట్టడం మహా పాపం. 

అది ధర్మవిహితం కాదని పెద్దలు చెప్తారు. అట్టి ధర్మమార్గం విడిచి అసుర మార్గం అవలంబించిన వారికి కార్యసిద్ధి కలుగదు. బ్రాహ్మణుడిగా పుట్టి ఇట్టి అపనిందలకు గురి కాగల కార్యమూ నేను చేయవచ్చునా ! అందుకేనేమో నాకు ఈ భూతం దాపురించింది. నాకిక ఎవరు దిక్కు అని చింతించాడు. 

అశ్వత్థామ ఈశ్వరుడిని ధ్యానించుట:

చివరకు అశ్వత్థామ ఈ సమయంలో నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు. అని అచంచలమైన మనసుతో అశ్వత్థామ పరమేశ్వరుడిని ద్యానించాడు. ఈశ్వరా ! నేను ఈ గండం గడచి గట్టెక్కిన నిన్ను నానా భూతోపహారములతో కొత్తవిధంగా అర్చిస్తాను. 

నీకు ప్రీతి కలిగిస్తాను అని అనేక స్తోత్రములతో శివుని ప్రార్ధించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు ఒక బంగారు వేదిక కనపడింది దాని మీద అగ్నిగుండం మండుతూ ఉంది. ఆ అగ్ని నుండి అనేక ఆకృతులతో ప్రధమగణాలు బయటకు వచ్చాయి. వాటికి అశ్వత్థామ భయపడ లేదు. అతడి మనసు ఈశ్వరుడి మీద లగ్నమై ఉంది. 

ఎంతకీ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. తన విల్లంబులతో ఆ అగ్ని గుండంలో దూకబోయాడు అశ్వత్థామ కాని తనను దహించుటకు సరిపోయిన అగ్ని ప్రజ్వరిల్ల లేదు. అశ్వత్థామ తన విల్లు, అమ్ములు, అస్త్రములు, శస్త్రములు, బాణములు, అనేక విధములైన ఆయుధములు వేసి అగ్నిని చక్కగా ప్రజ్వలింప చేసాడు. అశ్వత్థామ పరమేశ్వరా ! నాకు ఏమిచేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు లేని ఏడల నేను ఆత్మబలిదానం చేసుకుంటాను అని హర హర మహాదేవ అంటూ మంటలలో దూకబోయాడు. 

అప్పుడు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై అశ్వత్థామా ! ఆగు నీ భక్తికి అకుంఠిత దీక్షకు ఆనందించాను నీవు కోరినవరం ఇచ్చాను. కాని ఒక్క మాట నేనూ విష్ణాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడూ ఒక్కటే . కృష్ణుడు నన్ను పూజిస్తాడు, కృష్ణుడంటే నాకు ఇష్టం, ఆ కృష్ణుడి మీద గౌరవంతో నేను నిన్ను పాడవ శిబిరముల వైపు పోకుండా ఆపాను. 

నీ మనసులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను. ఇంతెందుకు ఆ పాంచాలురకు పోగాలము దాపురించింది. ఈ రోజు వారు నీ చేతిలో చస్తారు, ఇదిగో ఈ ఖడ్గంతో వారిని సంహరించు అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతడిలో ప్రవేశించాడు. 

అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తన రథం దగ్గరకు వెళ్ళగానే తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యదాతధంగా రధములో ఉన్నాయి. అశ్వత్థామ రథం మీదకు ఎక్కాడు. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మ వచ్చి చేరారు.

అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని వధించుట:

రధిక త్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడిని ప్రమదగణాలు అదృశ్యరూపంలో వెంబడించ సాగాయి. కృపాచార్యుడు, కృతవర్మలను ముఖద్వారమున ఉంచి తాను మాత్రం పాడవశిబిరాలలో ప్రవేశించాడు. 

ముందుగా దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుడిని తలచుకొని, ఈశ్వర దత్తమైన కత్తి చేతబూని కసిగా ధృష్టద్యుమ్నుడిని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి ధృష్టద్యుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. 

నేల మీదికిలాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్ళతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హటాత్పరిణామానికి ధృష్టద్యుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నారిని విప్పి ధృష్టద్యుమ్నుడి కంటానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. 

చివరకు నోట పెగల్చుకుని అశ్వత్థామా ! నన్ను నీ అస్త్రములు శస్త్రములు ప్రయోగించి చంపి నాకు ఉత్తమగతులు కల్పించు ఇలా నీచంగా చంపకు అని ప్రార్ధించాడు. అశ్వత్థామ వీలు లేదు నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమగతులు కలుగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపుతాను అని పిడికిలితో గుద్దసాగాడు. 

అప్పటికే అక్కడ ఉన్న వారు మేల్కొన్నా ! అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసుడని ఎవరూ ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్ళతో పిడికిలితో తన్నితన్ని మోదిమోది ధృష్టద్యుమ్నుడిని అతి కౄరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. ధృష్టద్యుమ్నుడి శిబిరం విడిచి వేరొక శిబిరానికి వెళ్ళాడు.

అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట:

అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నకాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేసారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. 

ఎవరో భయంకరాకారుడు వచ్చి ధృష్టద్యుమ్నుడిని చంపాడని కాపలాదారులు చెప్పారు. వాడిని పోనీయకండి పట్టుకోండి పొడవండి అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరుగెత్తారు. అందరూ కలసి అశ్వత్థామను పట్టుకున్నారు. 

అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడి శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టుపట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగనరికాడు.

 అశ్వత్థామను అడ్డుకునే వారు లేక పోయారు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుకుతున్నాడు అశ్వత్థామ. శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపదకుమారుల శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు అశ్వత్థామ.

 అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులనూ గుర్రములనూ తెగనరికాడు. మనిషాపశువా అనే తేడా లేకుండా అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింప చేస్తున్నాడు అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం అందులో నిద్రిస్తున్న వారిని నరకడం మరియొక శిబిరంలో ప్రవేశించడం ఆ విధంగా మారణకాండ సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడు అని భీతి చెందుతున్నాడు. 

అశ్వత్థామ ఉపపాడవులను సంహరించుట:

ఈ కలకలం విని శిఖండి ఉపపాండవులు ఒక వ్యూహంగా నిలిచి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడు విజృంభించి వారందరిని పరమేశ్వర ప్రసాదిత ఖడ్గంతో తృటిలో నరికి వేసాడు. 

అడ్డం వచ్చిన ప్రతివింద్యుడిని రెండు ముక్కలు చేసాడు. ఇంతలో భీమసేనుడి కుమారుడైన శ్రుతసోముడు భయంకరంగా అరుస్తూ అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ శ్రుతసోముని ఖడ్గమును ఖండించి అతడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. 

అంతలో నకులుడి కుమారుడైన శతానీకుడు అశ్వత్థామను ఎదుర్కొని చక్రాయుధమును ప్రయోగించి అశ్వత్థామను గాయపరిచాడు. అశ్వత్థామ శతానీకుడిని క్రింద పడవేసి అతడి శిరస్సు ఖండించాడు.

 ఇది చూసిన సహదేవుడి కుమారుడు శ్రుతసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని తనగధతో అశ్వత్థామను కొట్టాడు. అశ్వత్థామ తన చేతితో శ్రుతసేనుడి ముఖం మీద చరిచాడు. శ్రుతసేనుడు ముఖం పగిలి చనిపోయాడు. 

తన సోదరుల మరణం చూసిన అర్జునుడి కుమారుడు శ్రుతకీర్తి అశ్వత్థామను ఎదుర్కొని అతని కత్తికి బలి అయ్యాడు. ఈ విధంగా ద్రౌపదీ పుత్రులంతా అశ్వత్థామ చేతిలో మరణించారు.

అశ్వత్థామ శిఖండిని చంపుట:

శిఖండి వెంట ఉన్న ప్రభద్రకులు అశ్వత్థామను ఎదుర్కొని కొంచెం సమయం యుద్ధం సాగించినా అతడి మానవాతీత శక్తి కారణంగా అతడి చేతిలో నిలువ లేక పోయారు. 

తరువాత అశ్వత్థామ శిఖండిని రెండు ముక్కలుగా నరికి మిగిలిన వారిని కూడా తెగనరికాడు. ఈశ్వరదత్త ఖడ్గం అడ్డులేకుండా నరికి వేస్తుంది. ఒక్క వేటు వృధా కావడం లేదు. వేటుకు ఒక తల తెగిపడుతుంది. పాంచాలురు, వారి సేనలు, మిగిలిన పాండవ సేనలు, ప్రభద్రకులు, ద్రౌపదీ కుమారులు, ఏనుగులూ , హయములు నిశ్శేషంగా మరణించారు. 

కాని అశ్వత్థామకు పాండవులు కాని కృష్ణుడు కాని సాత్యకి కాని కనిపించ లేదు. అయినా కొంత మంది పాంచాలసేనలు, పాండవసేనలూ తప్పించుకుని పారిపోతున్నారు. అశ్వత్థామ వారిని కూడా తన శరములతో తరిమి తరిమి చంపుతున్నాడు. 

అశ్వత్థామ చేతి నుండి తప్పించుకు పారిపోతున్న వారు కొంతమంది ఏనుగులు హయముల కాళ్ళ కింద పడి చనిపోతున్నారు. ఏమి జరుగుతుందో తెలియక అయోమయంలో ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. 

అర్ధరాత్రి వరకు పాండవ, పాంచాల శిబిరాలలో ఏమి జరుగుతుందో తెలవనంతగా అల్ల కల్లోలితమైంది. తప్పించుకున్న రాజులు సైనికులు ముఖద్వారం వద్దకు రాగా అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారుని నిర్ధాక్షిణ్యంగా చంపారు.

రధికత్రయం తృప్తి చెందుట:

ఇంతలో తెల తెల వారుతుంది ఆ సౌప్తికవేళలో దారుణ మారణకాండను ముగించుకున్న అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను కలసి మామా ! సకల పాంచాలురు చచ్చారు. పాంచాలి కుమారులంతా యమసదనానికి వెళ్ళారు. 

మత్స్య, ప్రభద్రక సైన్యములు ఒక్కరూ మిగల లేదు. హయములు, ఏనుగులూ చచ్చాయి కాని పాండవులు, కృష్ణుడు, సాత్యకి మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియ లేదు అన్నాడు అశ్వత్థామ. కృతవర్మ, కృపాచార్యుడు అశ్వత్థామ బలపరాక్రమాలను పొగిడారు. 

అశ్వత్థామ మామా ! పాండవులను తప్ప మిగిలిన వాళ్ళనంతా చంపాను ఫలితం ఏముంది చెప్పు. అపాండవం చేస్తే రారాజు మనసుకు శాంతి కాని తక్కిన వారిని ఎంత మందిని చంపితే ఏమి ఫలము చెప్పు అన్నాడు. 

కృపాచార్యుడు అదేమిటి అశ్వత్థామా ! ఒకే రాత్రిలో ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలురను, ద్రౌపదీ సుతులను వారి వారి సైన్యములను ఒక్కరిని వదలకుండా చంపావు. అది సామాన్యమైన విషయమా చెప్పు అని కీర్తించారు. 

మామా ! కృతవర్మా ! మనమిప్పుడు రారాజు వద్దకు వెళ్ళి జరిగినదంతా అతడికి చెప్పి అతడి మనస్సుకు శాంతి చేకూరుస్తాము అన్నాడు. రధికత్రయం ముగ్గురూ సుయోధనుడి వద్దకు వెళ్ళారు. 

సుయోధనుడికి వార్త ఎరిగించుట:

ఆ సమయంలో సుయోధనుడు రక్తంతో తడిసిన నేలపైపడి దొర్లుతున్నాడు. ఊపిరి అందడం లేదు. ప్రాణాలు శరీరం వదిలిపోవడం లేదు . 

చాలా అవస్థ పడుతున్నాడు. మరణయాతన పడుతున్నాడు. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నాయి. ఆ సమయంలో రధికత్రయం అక్కడకు వచ్చారు. రారాజా ! ధరణీతలంబు అంతయూ ఏకఛత్రంగా పాంలించిన నీవు ఇప్పుడిలా కటిక నేల మీద పడి దొర్లుతున్నావా ! ఏమి విధి వైపరీత్యం, నీ ధైర్యం, ధీరత్వం , గధాయుద్ద సాధనా ఎందుకూ కొరగాకుండా పోయాయా రారాజా ! సుయోధనా. 

అయినా నీవు ఇప్పుడు పవిత్రమైన శమంతక పంచకంకంలో ప్రాణాలు విడుస్తున్నావు. నీకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. బలరాముడి శిష్యులలో అగ్రగణ్యుడవు, అటువంటి నిన్ను అక్రమంగా చంపిన భీముడు ఏమి బాగుపడుతాడు. 

వాడికీర్తి అంతా నాశనం అయిపోదా ! సుయోధనా ! నాకు కూడూగుడ్డా ఇచ్చి ఆదరించావు. యజ్ఞ యాగాదులకు కావలసిన ధనం సమకూర్చావు. కాని ఇప్పుడు నాకు కొండంత అండగా ఉన్న నీవు చనిపోతూ ఉంటే నేను బ్రతికి ఉన్నాను. 

సుయోధనా ! నీకు నేనేమి సేవచెయ్యగలను. నీవు న్యాయంగా యుద్ధం చేసి వీరమరణం పొందుతున్నావు. నీ శత్రువులను హతమార్చి నీ ఆఖరి కోర్కె తీర్చే అదృష్టం మాకు దక్కింది.

అశ్వత్థామ తన తండ్రికి సందేశం పంపుట:

రారాజా ! నీవు పుణ్యలోకముకు పోయినప్పుడు నా తండ్రిని చూసి ఆయనతో నా మాటగా చెప్పు ద్రోణాచార్యా ! నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన ఆ నీచుడు ధృష్టద్యుమ్నుడిని నీ కుమారుడు అశ్వత్థామ పశువును చంపినట్లు అతి దారుణంగా చంపాడు అని చెప్పు . 

నా తండ్రిని నాకు మారుగా నీవు కౌగలించుకో సుయోధనా ! ఇప్పటికే వీరస్వర్గం అలంకరించిన సోమదత్త బాహ్లికులను భూరిశ్రవసుడిని, సైంధవుని నేను అడిగినట్లు చెప్పు. అయ్యో సుయోధనా ! నిన్ను ఈ స్థితిలో చూసి వచ్చిన విషయం మరిచాను.

 నీ చెవులకు అమృతోపమయంగా రాత్రి జరిగినది చెప్తాను విను. నేను నిన్న సౌప్తికవేళలో పాండవశిబిరాలలో ప్రవేశించాను. ముందుగా ధృష్టద్యుమ్నుడిని పశువును చంపినట్లు చంపి తరువాత అతడి బంధువులను అందరిని కసితీరా చంపాను , ద్రౌపదీ పుత్రులను పేరుపేరునా వరుసగా చంపాను పాండవ సైన్యాలను ఊచకోత కోసాను.

గజములను, హయములను చంపాను. వారి శిబిరాలను పీనుగుల పెంట చేసాను . కాని సుయోధనా ! పాండవులు, కృష్ణుడు, సాత్యకి నా పాలపడ లేదు. 

నేను వస్తానని ముందుగా ఊహించి కృష్ణుడు వారిని అక్కడ నుండి తప్పించినట్లు ఉన్నాడు. పోనీలే అందరూ చచ్చిన తరువాత వారు ఉండి ఏమి ప్రయోజనములే ! సుయోధనా ! నా మామ కృపాచార్యుడు, కృతవర్మ తోడు లేకున్న ఈ కార్యం సిద్ధించేది కాదు అన్నాడు.

సుయోధనుడు కృతజ్ఞతలు చెప్పుట:

ఆ మాటలు విన్న సుయోధనుడికి నోట మాట రాకున్నా ! ఎలాగో నోరు పెగల్చుకొని అశ్వత్థామా ! భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికంటే ఈ రోజు మీరు ముగ్గురూ చేసిన వీరోచిత కార్యం గొప్పది. ఇది చాలా కష్ట సాధ్యమైన కార్యం. 

భీష్ముడు, కర్ణుడు గొప్పవాళ్ళని పొగుడుతాము కాని ఈ అవసాన దశలో మీరు చేసిన కార్యము మరువరానిది. మీరు సుఖంగా ఉండండి అందరమూ తిరిగి స్వర్గలోకంలో కలుసుకుంటాము పలికి సుయోధనుడు ప్రాణములు విడుచాడు. 

సుయోధనుడి శరీరం అనంత వాయువుల్లో కలిసాయి అతడి పార్ధివ శరీరం నేల మీద పడి ఉంది. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ సుయోధనుడి శరీరానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్కడి నుండి తమతమ రధములు ఎక్కి వెళ్ళారు. 

మరునాడు సూర్యోదయం అయ్యింది. ఇవన్నీ చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. 

సంబంధిత కథనాల కోసం :

సౌప్తిక పర్వము: ప్రథమాశ్వాసము

సౌప్తిక పర్వము: ద్వితీయాశ్వాసము

Note: ఈ ఛానెల్‌లోని కంటెంట్ నా స్వంతది కాదు. ఇది ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఈ కంటెంట్ యొక్క అసలైన రచయితలకు మరియు మూలాల‌కు నా గౌరవం వహిస్తున్నాను.

0 comments:

Post a Comment

Subscribe Us

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes