Home » » విరాట పర్వము: ద్వితీయాశ్వాసము

విరాట పర్వము: ద్వితీయాశ్వాసము

 


ధర్మరాజు విరాటరాజు కొలువులో ధర్మప్రసంగములు చేస్తూ, జూదక్రీడతో కాలం గడుపుతూ అందులో అర్జించిన ధనం తమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. భీముడు రాజుకు రుచిగా వండిపెడుతూ మిగిలిన ఆహార పదార్ధములను అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. అర్జునుడు తన కళాప్రదర్శనలలో గడించిన బహుమతులు అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. నకులసహదేవులు తమ విధి నిర్వహణలో అర్జించిన ధనాన్ని అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నారు. ఆ విధంగా నాలుగు నెలలలు గడిచాయి.

మల్లయోధుని వలలుడు ఓడించుట:

ఒక రోజు విరాటుని కొలువులోకి ఒక మల్లుడు ప్రవేశించాడు. అతని భయంకరాకారం చూసి విరాటుని కొలువులోని వారంతా భయపడ్డారు. మల్లుడు రాజా ! నేను అనేక రాజ్యాలు సందర్శించాను. ఎక్కడా నన్ను మల్లయుద్ధంలో గెలిచే వీరుడు కనిపించ లేదు. అందుకే మీ వద్దకు వచ్చాను అన్నాడు. 

కొలువులో ఉన్న మల్లులు కూడా అతనిని భంకరాకారాన్ని చూడగానే వెనుకడుగు వేసారు. విరాటుని మొహం చిన్నబోయింది. ధర్మరాజు విరాటుని చూసి విరాటరాజా ! ఇదివరకు నేను ధర్మరాజు కొలువులో ఉండగా ఒక మల్లుని చూసాను. 

అతడు ఇప్పుడు మీ కొలువులో వంటవాడిగా ఉన్నాడు. అతడు ఎందరో మల్ల యోధులను ఓడించాడు అని చెప్పి ఊరకున్నాడు. విరాటరాజు వెంటనే వలలుని పిలిపించాడు. వలలుడు రాగానే విరాటరాజు నీవు ఇతనితో మల్ల యుద్ధానికి సిద్ధం కమ్ము అన్నాడు. అప్పుడు భీముడు అన్నగారి వైపు చూసాడు. ధర్మరాజు అనుజ్ఞ ఇస్తూ కను సైగ చేసాడు. 

వలలుడు మహారాజా! నేను ఇదివరకు ధర్మరాజ సభలో అనేక మంది మల్ల యోధులతో పోరాడి ఆయనకు వినోదం కలిగించాను. అలాగే మీకూ వినోదం కలిగిస్తాను అన్నాడు. వలలుని వేషంలో ఉన్న భీముడు మల్లయోధునితో యుద్ధం మొదలు పెట్టాడు. భీముడు ఉత్సాహంతో తొడలు కొట్టాడు. ఇరువురు ఒకరిని ఒకరు చూసుకున్నారు. 

కిందికి వంగి మట్టిని వంటికి రాసుకున్నాడు. ఆఖరికి మల్లుని పట్టుకుని ముక్కు మీద గుద్ది బయటికి విసిరి వేసి భీముడు మల్లుని ఓడించాడు. విరాటరాజు వలలునికి ఎన్నో కానుకలిచ్చి సత్కరించాడు. భీముడు అక్కడున్న పేదవారికి ఆకానుకలు పంచి ఇచ్చి తిరిగి వంటశాలకు వెళ్ళాడు. ఆవిధంగా భీముడు మల్లులతో పోరుతూ అంతఃపుర కాంతలకు వినోదం కలిగిస్తున్నాడు. మల్లులు లేనప్పుడు సింహములతో, పులులతో పోరి వినోదం కలిగించాడు.

కీచకుడు ద్రౌపదిని చూచుట:

అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్నిరోజులలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్చికంగా ద్రౌపదిని చూసాడు. కీచకుడు మంచి అందగాడు, బలవంతుడు, కాని వివేక హీనుడు. అతడికి బలగర్వం, సౌందర్య గర్వం ఎక్కువ. అతడు విరాటరాజు కొలువులో దండనాయకుడు. 

కీచకుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయి ఆమె నుండి చూపులు మరల్చుకోలేక పోయాడు. అతడు మనసులో అహా! మానవులు ఎవరైనా ఇంతటి అందగత్తెను చూసి ఉండరు. ఇంతటి అందగత్తె మన్మధుని వద్ద ఉంటే ఆనాడు అతడు శివుని కూడా జయించే వాడు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని అయిదు బాణాలు కలిపి ఈమెను సృష్టిండో ఏమో. 

మన్మధుడు కూడా విరహతాపంలో వేగిపోతాడేమో. ఈ సుందరాంగి తల్లితండ్రులు ఎవరో, అదృష్టవంతుడైన భర్త ఎవరో, పేరు ఏమో, ఈమెను పొందే మార్గమేమిటో, ఈ పనికి ఎవరు నాకు సాయపడగరు అని పరిపరి విధాల ఆలోచించాడు. మాసిన చీర ధరించిన ద్రౌపది అతని వికారపు చూపులకు అసహ్యించుకుంది. ఆమె మనసులో ఇతడు ఏమిటి ఇలా చూస్తున్నాడు. 

ఇప్పుడు నన్ను ఇతని నుండి రక్షించే దిక్కెవరో అనుకున్నది. కీచకుడు అదేమి పట్టించు కోకుండా ఆమె చూపులను చూసి శృంగార చేష్టలని అపోహ పడ్డాడు. పక్కనే సుధేష్ణ, పరిచారికలు చూస్తున్నా పట్టించుకోకుండా ఆమె వైపు మోహంతో తధేకంగా చూసాడు. తరువాత తేరుకుని అక్క సుధేష్ణకు నమస్కరించాడు. ఆమె అతనికి ఉచితాసనం చూపించింది.

కీచకునికి సుధేష్ణ బుద్ధిమతి చెప్పుట:

కీచకుని మాటలు విన్న సుధేష్ణ నేను అనుకున్నంత అయింది. ఈ సైరంధ్రిని చూసి కీచకుడు మోహావేశంలో పడ్డాడు. వీడికి ఏమి కీడు మూడుతుందో? వద్దన్నా వినే వాడు కాదు. నేనేమి చేసేది? నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను అనుకున్నది. 

సుధేష్ణ తమ్ముడా కీచకా! నీ అంతఃపురంలో అతి సుందరులైన కాంతలు ఉన్నారు. ఈ నీరసాకార అయిన సైరంధ్రి ఎందుకు అని అనునయంగా చెప్పింది సుధేష్ణ. కీచకుడు అక్కా! ఈ సైరంధ్రిని పోలిన అందగత్తె ఈ భూమి మీదే కాదు దేవతలలో కూడా లేదు ఇది నిజం. ఆమె నేత్రాలు, పద్మాలవంటి కళ్ళు, ఆ కోకిల కంఠం, ఆ మేని సొంపు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఏ ఉపాయం అయిన సరే ఆమె నాకు కావాలి అన్నాడు.

 కీచకుడు మామూలు మాటలతో వినడని సుధేష్ణ కొంచం కటువుగా చెప్ప సాగింది. తమ్ముడా కీచకా! పరస్త్రీ సాంగత్యం వలన నీ ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి హరింపబడతాయని తెలియదా? ధర్మాత్ములు దీనిని హర్షించరు. భర్తకు తెలిస్తే ప్రాణం మీదకు వస్తుందని, ఇతరులు చూస్తే పరువు పోతుందని, సాటి ఆడువారికి తెలిస్తే గౌరవం పోతుందని, బంధువులకు తెలిస్తే వంశనాశనం ఔతుందని క్షణ క్షణం భయపడుతూ, భయపడుతూ, వ్యధతో ఉండే పరస్త్రీతో ఏమి సుఖపడతావు. 

జారిణితో పొందు సుఖం కాదని అందరూ దూరంగా ఉంటారు. ఆమె భర్తలు గంధర్వులు వాళ్ళ చేతిలో నీవు మరణించవచ్చు. దానిని మర్చిపోరా తమ్ముడూ. చెడు మార్గలో చరించే వారికి వినాశనం తప్పదు నీ లాంటి బుద్ధి మంతులకు ఇది తగదు అన్నది సుధేష్ణ. అక్క చెప్పిన మాటలు కీచకుని చెవికెక్క లేదు. 

ఓ సుధేష్ణా! ఒక్క మాట చెప్తున్నాను విను. ఈ భూలోకంలో నన్ను ఎదిరించి నిలువగల వీరుడు లేడు. నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను. కనుక నాకు బుద్ధి చెప్పుట మాని నా కోరిక మార్గం సుగమం చెయ్యి అని వంగి అక్క పాదాలకు నమస్కరించాడు. సుధేష్ణ ఇక వీడు ఏమి చెప్పినా వినడు. వీడికి ఆమెను జతచేస్తే సరి. ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చస్తాడు. లేకున్న మన్మధుడి చేతిలో చస్తాడు. ఎలాగైనా వీడికిక చావు తధ్యం అనుకున్నది సుధేష్ణ. 

సుధేష్ణ మాలినిని కీచకుని ఇంటికి పంపుట:

సుధేష్ణ కీచకుని మంకుపట్టు గ్రహించి తమ్ముడా కీచకా! ఎందుకు ఆరాట పడతావు. ఆమెను నీ వద్దకు పంపుట కష్టం కాదులే నీవు వెళ్ళు సైరంధ్రిని నీ వద్దకు పంపుతాను ఆ తరువాత నీ ఇష్టం అన్నది. అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసాడు, మధుర రసాలు ఏర్పాటు చేసాడు, పని వారందరిని పంపివేసాడు చేసాడు. 

తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుధేష్ణ సైరంధ్రిని పిలిచి మాలినీ! నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మధ్యం ఉంది తీసుకురా అన్నది ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమెకు శరీరం నిండా చెమట పట్టింది. 

ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుని ప్రార్ధించింది. ద్రౌపది అమ్మా! నన్ను వదిలి పెట్టు. మధిరను తీసుకురావటానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయనని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమయినదని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్ము నమ్మి మీ ఇంట ఉన్నాను. మిమ్ము నమ్మిన నా వంటి అనాధను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా అన్నది. 

సుధేష్ణ మాలినీ! నేను మనసు పడి త్రాగాలని మధ్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా. మన స్నేహం ఇంతేనా అని తెలియకుంది అని నిష్టూరంగా మాట్లాడింది. దేవుని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె సూర్యునికి నమస్కరించి ఓ సూర్య భగవానుడా! నేను పాండు పుత్రులను తప్ప అన్యులను మనసునైనా తలపనేని నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగ కుండా కాపాడు అని ప్రార్ధించింది. 

సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. అతడు అదృశ్య రూపంలో ద్రౌపదిని వెన్నంటి వస్తున్నాడు. ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని ఇంట ప్రవేశించింది. కీచకుడు ఆమె రాకకోసమే ఎదురు చూస్తున్నాడు.

ద్రౌపది విరాటుని కొలువులో ప్రవేశించుట:

ద్రౌపది కీచకునితో మాదేవి తృష్ణ తీరటానికి మధిర తీసుకు రమ్మంది. త్వరగా మధిరను ఇవ్వండి అన్నది. కీచకుడు మీ దేవి తృష్ణ తీర్చినట్లే నా తృష్ణ తీర్చవా అన్నాడు. ద్రౌపది ఆలస్యం అయితే మా దేవి కోపిస్తుంది. త్వరగా మధిరను ఇవ్వండి అన్నది. 

కీచకుడు మధ్యం వేరే వాళ్ళతో పంపుతాను. నీవు ఈ మధ్యంత్రాగి నా తాపాన్ని పోగొట్టు. నిన్ను నా రాణిని చేసుకుంటాను. అపారమైన మణిభూషణాలు, విలాస గృహాలు నీకు సమర్పిస్తాను. నా భార్యలను నీకు దాసిని చేస్తాను. నేను నీ కనుసన్నలలో మెలుగుతాను అంటూ కీచకుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు. 

అంతలో ద్రౌపదికి రక్షగా ఉన్న రాక్షసుడు ఆమెలో ప్రవేశించాడు. అంత బలాడ్యుడైన కీచకుని ఆమె విదిలించి కొట్టి బయటకు వచ్చింది. కీచకుడు ఆ మెను వెంబడించాడు. ద్రౌపది పరుగెత్తి విరాటుని కొలువులో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంట కొలువులో ప్రవేశించి ఆమె జుట్టు పట్టుకుని లాగి కింద పడేసాడు. ఆ సమయంలో ఆమెలో ఉన్న రాక్షసుడు కీచకున్ని కొట్టి లాగి కింద పడవేసాడు. కీచకుడు ఆ బదెబ్బకు అవమానంతో కుంగి పోయాడు. 

ఆసమయంలో అన్నగారితో పాటు కొలువు కూటంలో ఉన్న భీముడు ఆగ్రహంతో ఊగి పోయాడు. ఒక్క క్షణం తమ అజ్ఞాత వాస విషయం మరిచాడు. కీచకుని పైన పట్టరాని కోపంతో వెంటనే పక్కన ఉన్న వృక్షాన్ని చూసి అలాగే అన్నగారి వైపు చూసాడు. ధర్మజుడు భీముని కను సైగతో వారించాడు. ధర్మరాజు విరాటునితో మహారాజా! మన వంటల వాడు వలలుడు ఎక్కడ చూసాడో కాని వంట చెరకు కొరకు వేరు వృక్షాలు లేవా? ఫలపుష్పాదులతో ఉండి నలుగురికి నీడ నిచ్చే వృక్షాన్ని వంట చెరకు కొరకు ఖండించడం తగునా అన్నాడు. 

భీముని కోపం ధర్మరాజు వారింపు ద్రౌపది చూసి విరాటునితో అయ్యా! ధర్మాధర్మాలు తెలిసిన వారు, శత్రువులను అవలీలగా చంపగలిహిన వారు, గంధర్వులు అయిన నా భర్తలు అయిదుగురు నన్ను ఈ కీచకుడు అవమానిస్తుంటే చూస్తూ ఊరకున్నారు. ఇక సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఏది. ఈ విరాటరాజు కొలువులో స్త్రీకి అవమానం జరుగుతుంటే ఎవరూ పలకరేమి? ఎవరికీ కరుణ లేదా? ధర్మరక్షణ చేయవలసిన రాజు ఇలా మిన్నకుండటం భావ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. 

అది చూసిన విరాటరాజు కీచకుని మందలించడానికి ధైర్యం లేక ద్రౌపదిని అనునయించాడు. అది చూసి కీచకుడు తన మందిరానికి వెళ్ళాడు. కలత చెందిన మనసుతో ధర్మరాజు ద్రౌపదిని చూసి సైరంధ్రీ! నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు అంతఃపురానికి వెళ్ళు. నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు మాత్రం కోపించరా? ఇది సమయం కాదని ఊరకుండి ఉంటారు. 

నీ భర్తలను నిందించడం తగదు. కులస్త్రీ నిండు సభలో ఇలా మాట్లాడటం భావ్యమా అన్నాడు. కాని ద్రౌపది అక్కడి నుండి కదలక ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ధర్మరాజు ఓ సైరంధ్రీ! ఏమిటిది పదిమందిలో నాట్యకత్తెలా నిలబడ్డావు. కులస్త్రీలకు ఇది తగదు అన్నాడు. ద్రౌపది రోషంగా తల ఎత్తి ధర్మరాజును చూసి ఓ కంకు భట్టా! నా భర్త ఒక నటుడు ఇది సత్యము. 

పెద్దల ప్రవర్తన చూసి పిన్నలు ప్రవర్తిస్తారు. నా భర్త నటుడు కనుక నేను నర్తకినే. నా భర్త నటుడే కాదు జూదరి కూడా. ఒక జూదరి భార్యకు గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి ? అంటూ ద్రౌపది సభ నుండి వెళ్ళి పోయింది. 

ద్రౌపది సుధేష్ణ వద్ద విలపించుట:

ద్రౌపది తనను ఒక దూర్తుని ఇంటికి మదిరకు పంపిన సుధేష్ణకు తన బాధ చెప్పుకోటానికి ఆమె మందిరానికి వెళ్ళింది. సుధేష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ మాలినీ ! ఏందుకు ఇలా ఉన్నావు. నిన్ను ఎవరేమి అన్నారు. ఏమి జరిగిందో చెప్పు వారి అంతు చూస్తాను అన్నది. ద్రౌపది నిర్వేదంగా నవ్వి అమ్మా ! అన్నియు తెలిసి కూడా ఇలా అడిగితే ఏమి చెప్ప గలను. 

నీవు కీచకుని ఇంటికి మధిర కోసం నన్ను పంపావు. అతను నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను పరుగెత్తాను. అతడు నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతకంటే ఏమి చెప్పేది అన్నది. సుధేష్ణ ద్రౌపదితో ద్రౌపదీ! విచారించకు నేను ఆ కీచకుని దండిస్తాను అని అనునయంగా అన్నది. 

ద్రౌపది సుధేష్ణతో అమ్మా! తమరు అంతగా చింతించ పనిలేదు. నా భర్తలైన అయిదుగురు గంధర్వులు కీచకునిపై పగతీర్చుకుంటారు అని పలికింది. ఆ మాటలు విన్న సుధేష్ణ భయభ్రాంతురాలయ్యింది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానో ఓదార్చింది. ద్రౌపది కోపం తగ్గలేదు. అన్న పానీయాలు విసర్జించి తన నివాసమునకు పోయి రోదిస్తూ ఉంది.

ద్రౌపది భీముని సహాయం అర్ధించుట:

ద్రౌపది మనసులో కీచకుడు మహాబలవంతుడు. అతనిని చంపగలిగిన సామర్ధ్యం భీమునికి మాత్రమే ఉంది అని తలచింది. ఆ రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో భీముని వద్దకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతున్న భీముని చూసి ఆహా ! నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కాని అది చూసిన మీరు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు. 

అన్నగారు ఇది తగిన సమయం కాదని చెప్పాడనా అనుకుంటూ అతడిని తట్టి లేపింది. భీముడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి ఎవరు? అని అడిగాడు. ద్రౌపది నేను మాలినిని అన్నది. భీముడికు ద్రౌపది ఎందుకు వచ్చిందో అర్ధమైనా ఆమె నోట వినాలని ఏమిటి ఇంత పొద్దుపోయి వచ్చావు?. ఎవరు చూడకుండా వచ్చావా? అని అడిగాడు. ద్రౌపది అన్ని తెలిసి నన్ను అడుగుతారేమి. 

నా నోట వినాలనుందా! విరాటుని బావమరిది కీచకుడు సుధేష్ణ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసాడు. అతడు నన్ను మోహించి అనరాని మాటలాడి నన్ను అవమానించాడు. నేను అతనితో నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు జాగ్రత్త అన్నాను. సుధేష్ణ పంపగా మధిర కోసం కీచకుని ఇంటికి వెళ్ళాను. 

అతను నన్ను పట్టుకోవాలనుకున్నాడు నేను అతనిని విదిలించి పరుగెత్తుతూ సభా మండపానికి వచ్చాను. అతడు నన్ను వెన్నంటి తరుముతూ వచ్చాడు. అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధవుడు అవమానించాడు. ఈ నాడు విరాటుని కొలువులో కీచకునిచే అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్తగాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరుల ధర్మం. 

నేను ఇలా విలపిస్తుంటే ధర్మరాజు చూస్తూ ఎలా ఉన్నాడు? అన్నది. భీముడు ద్రౌపదీ! కీచకుడు నిన్ను అవమానించడం చూసిన నన్ను ధర్మరాజు అడ్డుకోకపోతే విరాటునితో సహా కీచకుని అతని సైన్యాన్ని హతమార్చే వాడినే. కాని అజ్ఞాతవాసం భగం అయితే మరలా అరణ్యవాసం అజ్ఞాతవాసం ప్రాప్తించేవి. దీనికంతా కారణం నీవు నేను అని అందరూ మనలను నిందించరా. కనుక నన్ను నివారించిన ధర్మరాజును నిందించ వలదు. సమయం మించి పోలేదు. 

కీచకుని చంపి నీకు ఆనందం కలిగిస్తాను అదెంత పని. కాని అది బహిరంగంగా జరగరాదు. రహస్యంగా చేయాలి కదా అన్నాడు. ద్రౌపది నేను ఎవరికి భయపడ లేదు. అత్తగారు కుంతిని చూసి కాని భర్తలైన మిమ్మల్ని చూసి కాని భయపడ లేదు. కాని సుధేష్ణను చూసి భయం కలుగుతుంది. మూర్కుడైన కీచకుని వలన జరిగిన అవమాన భారంతో అన్నాను కాని విషయం తెలియక కాదు. ధర్మరాజుని నిందించడం నా అభిమతం కాదు అన్నది.

ద్రౌపది భర్తల అవస్థలను తలచుకుని దుఃఖించుట:

ఇంకా ధర్మరాజును గురించి ద్రౌపది ఇలా చెప్పింది. భీమసేనా! రాజసూయ యాగ కర్త, అజాతశత్రువు, ధర్మనిరతుడనే పేరు ధర్మరాజుకే చెల్లింది కాని వెరెవరికి తగదు. అతని గంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతం మరెవరికి ఉంటాయి. అతడు సామాన్య మానవుడు కాదు. అట్టి మహాత్ముడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే బాధగా ఉంది. 

బకాసురుడు, కిమ్మీరుడు(జరాసంధుడు) మొదలైన రాక్షసులను చంపిన నీ లాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం ఎంత బాధాకరం. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో అంత॰పుర కాంతలకు నాట్యం నేర్పుతుంటే చూడటానికి కూడా మనసు ఒప్ప లేదు. అత్యంత సుందరాంగుడు అరివీర భయంకరుడు అయిన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే కన్నుల నీరు ఆగడం లేదు. 

అత్యంత సుకుమారుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే దుఃఖభారం ఆగలేదు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలు పొంది, రాజసూయ యాగంతో పునీతనై కుంతీదేవి లాంటి మహానుభావురాలి మన్ననలందిన నేను నేడు సైరంధ్రిగా సామాన్యురాలిగా సేవిస్తున్నాను. భీమసేనా! కీచకుని వధించక పోతే నాకు మనశ్శాంతి లేదు అని దుఃఖించింది.

 భీముడు ద్రౌపదీ! నీవు ఇంతగా చెప్ప పని లేదు. రేపటి రోజున కీచకునికి నా చేతిలో చావు మూడింది. నీవు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాసం ముగియనున్నది. రేపు నువ్వు కీచకుని కోర్కె అంగీకరించినట్లు నటించి అతనిని నర్తనశాలకు ఒంటరిగా రమ్మని చెప్పు. నేను అతనిని చంపుతాను. తెల్లవారబోతుంది ఇక వెళ్ళు అన్నాడు.

ద్రౌపది కీచకుని నర్తన శాలకు ఆహ్వానించుట:

మరునాడు ఉదయం కీచకుడు నిద్రలేచాడు. కాలకృత్యాలు నిర్వర్తించాడు. ద్రౌపది మీది కోరిక కలిగింది. చక్కగా అలఖరించుకున్నాడు. ద్రౌపది కోసం సుధేష్ణ అంత॰పురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఆమె దగ్గరగా పోయాడు. భీముడు చెప్పిన మాటలు మననం చేసుకుంది ద్రౌపది. 

అతనిని చూసీ చూడనట్లు నటించింది. కీచకుడు ద్రౌపదితో మాలినీ ఈ తిరస్కారం ఏమిటి? నేనంటే ఇష్టం లేదా? అసలు మగాళ్ళంటేనే ఇష్టం లేదా? నా సంపదలకు నీవే రాణివి. ఈ రాజ్యాన్నేలే విరాటరాజు పేరుకు మాత్రమే రాజు. నేనే అతనికి కూడు పెడుతున్నాను. ఈ రాజ్యంలో ప్రజలందరూ నన్నే రాజుగా ఆరాధిస్తారు. 

ఈ రాజ్యంలో ప్రజలెవరికీ నా మాట కాదనే ధైర్యం ఎవరికీ లేదు అన్నాడు. ద్రౌపది కొంచం మెత్తబడినట్లు నటించి కీచకా! ఎంత కాదన్నా వినకుండా నా మీద మనసు పారేసుకున్నావు. నీలాగే ఎదుటి వారూ మనసు పారేసుకుంటారు కదా. మీరు పురుషులు కనుక బయట పడతారు కాని మగువలు అలా కాదు కనుక కీచకా రహస్యంగా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు అంటూ నమ్మబలికింది ద్రౌపది. 

కీచకుడు ఆనందపరవశుడై మాలినీ నీ మనసు తెలిసింది కదా మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు అని అడిగాడు. ద్రౌపది ఈ రోజు ఒంటరిగా నర్తనశాలకురా అన్నది. కీచకుడు మాలినీ! నీ అనుమతి ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు వస్తాను. మాట మీద ఉండు అన్నాడు. ద్రౌపది నీవు ఒక్కడివే రావాలి. లేకుంటే నేను వెడలి పోవుట నిశ్చయం. ఇక మనమిరువురము ఇక్కడ ఉండుట భావ్యం కాదు వెళ్ళి పొండి అన్నది. 

కీచక వధ:

కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో నేను నాపని పూర్తి చేసాను. ఇక మీ పని మీరు పూర్తి చెయ్యండి. ఈ రాత్రికి కీచకుని చంపాలి ఎలా చంపుతారో చెప్పండి అన్నది. భీముడు ద్రౌపదితో ద్రౌపదీ! నీవు కీచకుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పు అని అడిగాడు. ద్రౌపది జరిగినది చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు.

 భీముడు ద్రౌపదీ ! ఇక చాలు ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను కాని అతడు చెప్పినట్లు ఒంటరిగా వస్తాడా! లేక బుద్ధిహీనుడై అందరికి చెప్తాడా? అయినా ఎందుకు చెబుతాడులే. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా పడుకున్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలిసుకుంటాడు. నేను ఒడిసి పట్టుకుని వాడి అంతు చూస్తాను. 

వాడు నా చేతిలో హతం కావడం నిశ్చయం ద్రౌపదీ! ఇక నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు. భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాస భంగం ఔతుందేమో అనుకున్నది. ద్రౌపది భీమసేనా! కోపావేశంలో గుట్టు రట్టు చేయకు ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు. 

కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలి అన్నది. భీమసేనుడు ద్రౌపదీ !వాడు ఎదిరించి నిలబడితే ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుందా. అయినా నీవు చెప్పినట్లు రహస్యంగా చంపడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ద్రౌపది సుధేష్ణ నా కొరకు వెతుకుతుంటుంది నేను పోయి వస్తాను అని వెళ్ళి పోయింది.

కీచకుడు, ద్రౌపది, భీమసేనుడు రాత్రి కొరకు ఎదురుచూచుట:

కీచకుడు మనసు పరి పరి వధాల తపిస్తుంది అతడు మనసులో అయ్యో ! ఎంతకీ రాత్రి కాదేమి. మాలిని వస్తుందో రాదో, వచ్చినా ఏమంటుందో, రాత్రిలోగా మనసు మారుతుందేమో, ఆమెకు అయిదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్న మాట నిజమేనా, మాలిని వచ్చే వేళకు సుధేష్ణ ఏదైనా పని చెప్తుందేమో అనుకున్నాడు. మరలా మాలిని ఎందుకు రాదులే అంత కఠినాత్మురాలా . 

ఆమె వచ్చే ముందు నేనే ఆమెను తీసుకు రావచ్చు కదా అనుకున్నాడు. కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించనందుకు సూర్యుని నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి రాకుండా పగలే ఉంచాడని అనుమాన పడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు. చంద్రోదయం అయింది ద్రౌపది కూడా సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది.

 చంద్రుడు కూడా అస్తమించాడు. బాగా పొద్దు పోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళి సమయం ఆసన్నమయినదని భీమసేనుని తొందర పెట్టింది. భీముడు ఒక చీరని తలపాగాలా చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు. ద్రౌపది అతనిని అనుసరించింది.

నర్తనశాల:

ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. 

మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. 

నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను అన్నాడు కీచకుడు. భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో మిమ్మల్ని మీరు పొగుడు కుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. 

నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే . నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.

కీచక భీములపోరాటం:

కీచకుని వధ దృశ్యం

ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. 

ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళాను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. 

భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు అనుకున్నది. భీముడు ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా బుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. 

నీ మనసు శాంతించింది కదా అన్నాడు. ద్రౌపది ఆనందంతో నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా అన్నది. 

ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు. 

సంబంధిత సమాచారం కోసం :

విరాట పర్వము: ప్రథమాశ్వాసము

విరాట పర్వము: ద్వితీయాశ్వాసము

విరాట పర్వము: తృతీయాశ్వాసము

విరాట పర్వము: చతుర్థాశ్వాసము

విరాట పర్వము: పంచమాశ్వాసము

Note: ఈ ఛానెల్‌లోని కంటెంట్ నా స్వంతది కాదు. ఇది ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఈ కంటెంట్ యొక్క అసలైన రచయితలకు మరియు మూలాల‌కు నా గౌరవం వహిస్తున్నాను.

0 comments:

Post a Comment

Subscribe Us

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes