ఆది పర్వము: చతుర్థాశ్వాసము

 



పూరుడు జనరంజకంగా రాజ్యపాలన చేసాడు. పూరుని కుమారుడు జనమేజయుడు,అతని కుమారుడు ప్రాచిన్వంతుడు,అతని కుమారుడు సంయాతి అతని కుమారుడు అహంయాతి అతని కుమారుడు సార్వభౌముడు ఆతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిధి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు. మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేసాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనేకుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు.


శకుంతలా దుష్యంతుల పరిచయం :


దుష్యంతునికి లేఖ వ్రాస్తున్నశకుంతల


దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలనూ వేటాడి పట్టుకుంటూ ఆడుకొనేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు. ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. 

అది బద్ద శత్రువులైన సింహాలూ ఏనుగులూ లాంటి జంతువులనేకం కలసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం. దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్ధం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతల ను చూసాడు. ఆమె అందానికి ముగ్ధుడైయ్యాడు. 

శకుంతలనూ దుష్యంతుని అందం ఆకర్షించింది. పరస్పర పరిచయా లయ్యాక ఆమె కణ్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వమహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు.

మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం-శకుంతల జననం :


రాజర్షి విశ్వామిత్రుడు ఒకానొకసారి ఘోర తపమాచరిస్తున్నాడు. అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి మేనకను నియోగించాడు. దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రిని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. 

ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది. జరిగిన పొరబాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదలి తపోభూమికి వెళ్ళాడు. ఆ తరువాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడ శిశువును చూసిన కణ్వుడు ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్నబిడ్డవలె చూసుకున్నాడు.

శకుంతలా దుష్యంతుల వివాహం :


శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్ధానం చేసాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు. కణ్వమహర్షి ఆ విషయం దివ్యదృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు. 

ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహా బలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు. మహర్షి మాటలను నిజంచేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు. కణ్వమహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు. 

శకుంతల దు॰ఖిస్తూ పలువిధాల ప్రార్ధించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు. చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యా బిడ్డలను నిరాకరించానని ఒప్పుకుని వారిరువురిని స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేసాడు. 


భరతవంశం :


అడవిలో సింహములతో ఆడుకొనుచున్న భరతుడు


భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో వానప్రస్థానికి వెళ్ళాడు. రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యుని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు హస్థి. అతని పేరు మీద హస్థినాపురం వెలసింది. హస్తి కుమారుడు వికుంఠనుడు. అతని కుమారుడు అజఘీడుడు. అజఘీడునకు నూట ఇరవై నాలుగు మంది కుమారులు. 

వారిలో సంవరణుడు అనే వాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురు జన్మించాడు. కురు మరొక వంశకర్త అయ్యాడు. అతని పేరు మీద కురువంశం ఆరంభం అయింది. కురువంశస్థులు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయింది. కురు కుమారుడు విధూరుడు. అతని కుమారుడు అనశ్వుడు. అతని కుమారుడు పరీక్షిత్తు . అతని కుమారుడు భీమశేనుడు. అతని కుమారుడు ప్రదీపుడు. అతని కుమారుడు ప్రతీపుడు. 

అతని కుమారుడు శంతనుడు. శంతనునికి గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు. అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా పిలువబడ్డాడు. శంతనుడు తనను గంగాదేవి విడిచివెళ్ళిన చాలా కాలంతరువాత మత్స్యగంధి అనే కారణ నామధేయం ఉండి యోజన గంధిగా మారిన దాశరాజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. 

వారికి చిత్రాంగధుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. జనమేయజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వైశంపాయుని అడిగాడు.

భీష్ముని జన్మవృత్తాంతం:


పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి ఆశ్వమేధ యాగాలూ నూరు రాజసూయ యాగాలూ చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమెచీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమెవంక ఆసక్తిగా చూసాడు. 

అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్ధించాడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. తనవంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న ఆష్ట వశువులను చూసింది. 

వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది. దానికి సమాధానంగా వారు వశిష్ట మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు.

వశువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్గాయువౌతాడని అది వశిష్ట శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒక రోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడితొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. 

పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మ వాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు. 

శంతనుడు గంగాతీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన ఏడుగురు వశువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిభంధలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది.

 ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు దీర్గాయుష్మంతుడని అతనికి విద్యాబుద్దులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యాపారంగతుడూ మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది.

అష్టవశువుల వృత్తాంతం :


గంగాదేవి శంతనుని విడిచి వెళ్ళే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు.సమాధానంగా గంగాదేవి మహారాజా వరుణుడి కుమారుడు వశిష్ఠుడు.అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకుని తపమాచరిస్తున్నాడు.నందిని అనే కామదేనువు వశిష్టుడికి కావలసిన సమస్త వస్తువులూ సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది.

ముని వద్దకు వచ్చిన అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు తీసి ఇస్తే దానిని తన స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది.మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆధేనువును వశిష్టుడి నుండి పట్టుకుని వెళ్ళడానికి తోడ్పడ్డారు.యోగదృష్టితో ఇది గ్రహించిన వశిష్ఠుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు.

వసువులు తప్పు గ్రహించి వశిష్టుని కాళ్ళ మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. వశిష్ఠుడు అలాగే జరుగుతుంది కానీ ఎనిమిదవ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతాన హీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు. అని శంతన మహారాజుకు చెప్పి ఎనిమిదవ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతనుని విడిచి వెళ్ళింది. 


దేవవ్రతుని శంతనునికి అప్పగిస్తున్న గంగా దేవి


భీష్మ ప్రతిజ్ఞ :


గంగాదేవి శంతనునికి ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు మహారాజు గంగాతీరంలో విహరిస్తున్న సమయంలో అతడి కుమారుడైన దేవవ్రతుడిని అతడికి అప్పగించింది. శంతనుడు దేవవ్రతుడిని యువరాజుని చేసాడు. ఒకరోజు శంతనుడు యమునానదీ తీరంలో యోజన గ్రంధిని చూసి ఆమెపై మనసుపడ్డాడు . 

ఆమెను వివాహమాడ నిశ్చయించి యోజన గ్రంధితో ఆమె తండ్రి అయిన దాశరాజు ఇంటికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు.అందుకు దాశరాజు సంతోషించినా సత్యవతిని శంతనునికి ఇవ్వడానికి ఒక నిభంధన పెట్టాడు. తన కూతురైన సత్యవతి కుమారులను చక్రవర్తిని చేయాలన్నది ఆ నిబంధన. శంతనుడు గాంగేయుడైన దేవవ్రతుని విడిచి వేరొకరిని రాజ్యాభి షిక్తుని చేయడానికి మనస్కరించక విచారిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 

దేవవ్రతుడు తనతండ్రి విచారం గ్రహించి మంత్రుల ద్వారా సత్యవతి విషయం తెలుసుకుని ఆమెతో తండ్రికి వివాహం జరపాలని నిశ్చయించుకున్నాడు. అతడు దాశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి శంతనునికి సత్యవతిని ఇమ్మని అడిగాడు. దాశరాజు దేవవ్రతునితో ఆమె ఉపరిచర మనువు కుమార్తె అని ఆమెను శంతనునికి ఇవ్వాలన్నది ఊపరిచర మనువు అభిమతమని చెప్పాడు. 

అందువలన ఆమెను దేవలుడు అడిగినా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తరువాత ఆమెకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మతిస్తేనే వివాహమని చెప్పాడు. గాంగేయుడు వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులని చెప్పాడు. కానీ దాశరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారులు రాజ్యాన్ని అడిగితే ఎలా అని సందేహం వెలిబుచ్చాడు. 

అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసాడు. అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది. ఆ తరువాత దాశరాజు శంతనునితో సత్యవతి వివాహం జరిపాడు. తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనంద పడిన శంతనుడు భీస్ముడికి ఇచ్ఛామరణం అనేవరాన్ని ఇచ్చాడు.

చిత్రాంగద విచిత్రవీర్యులు :


ఆ తరువాత శంతనునికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారి చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు. భీష్ముడు తమ్ములను పెంచి పెద్ద చేసాడు. చిత్రాంగదుని చక్రవర్తిని చేసాడు. అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు. 

తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేసాడు. కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడు అక్కడకు వెళ్ళి సాళ్వుడితో సహా అక్కడకు వచ్చిన రాజులను జయించి వారిని తీసుకు వెళ్ళి విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అంబ తను సాళ్వుని ప్రేమించినట్లు భీష్మునితో చెప్పింది.

వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు ఆమెకు బ్రాహ్మణులను తోడిచ్చి సాళ్వుని చెంతకు పంపి అంబిక, అంబాలికలను మాత్రం విచిత్ర వీర్యునకిచ్చి వివాహంచేసాడు. విచిత్ర వీర్యుడు భోగ లాలసుడై చివరకు మరణించాడు. ఇలా రాజ్యం రాజులేనిది అయింది.

దేవర న్యాయం :


ఒక రోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషిక్తుడై వివాహం చేసుకుని వంశోద్దరణ చేయమని కోరింది. భీష్ముడు తాను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్దరణ కోసం దేవరన్యాయం పాటించమని తల్లికి నచ్చ చెప్పాడు. ఉదాహరణగా పూర్వం పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు. 

అలాగే బృహస్పతి ఒక రోజు తన తమ్ముడైన ఉతధ్యుని భార్య మమతపై మనసు పడగా అప్పుడు ఆమె గర్భస్థ శిశువు దానికి అభ్యంతరం చెప్పగా అతనిని పుట్టు గుడ్డివి కమ్మని బృహస్పతి శపించాడు. అతడే దీర్ఘతముడు. అతడు గుడ్డి వాడైనా వేదవేదాంగాలనూ అభ్యసించాడు. అతని భార్య ప్రద్వేషిణి. అతనికి చాలా మంది పుత్రులు కలిగినా భార్య అతనిని ద్వేషిస్తూ ఉంది. చివరికి ఆమె అతనిని ఇక భరించలేనని తనను విడిచి వెళ్ళమని చెప్పింది. 

దీర్గతముడు ఆమెపై కోపించి స్త్రీలు ఎంతటి వారైనా భర్త లేని ఎడల అలంకార హీనులులై బ్రతుకుదురుకాక అని శపించాడు. అందుకు కోపించిన ప్రద్వేషిణి తన కొడుకులతో చెప్పి వారితో దీర్గతముని తాళ్ళతో బంధించి నదిలోకి త్రోసి వేయించింది. అతడు వేదాలు వల్లెవేస్తూ నదిలో కొట్టుకు పోతున్నాడు .అది చూసిన బలి అనే రాజు అతనిని విడిపించి తనతో తీసుకు వెళ్ళాడు. బలి దీర్గతమునితో సంతాన హీనుడినైన తనకు ఉత్తమ బ్రాహ్మణుడివయిన నీవు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు. దీర్గతముడు అందుకు అంగీకరించాడు. 

అతనిద్వారా సంతానము కని ఇవ్వమని భార్య అయిన సుదేష్ణను కోరాడు. సుదేష్ణ దీర్గతముని చూసి అసహ్యపడి అతని వద్దకు తన దాసీని పంపింది. దాసీకి అతని వలన పదకొండు మంది కుమారులు కలిగారు. దీర్గతముని వలన వారు దాసీ పుత్రులని తెలుసుకుని సుదేష్ణను తిరిగి అతని తగ్గరకు పంపాడు విధిలేక సుదేష్ణ అతని వలన ఒక కుమారుని కన్నది . అతడే అంగరాజు. 

కనుక విధిలేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మ విరుద్దం కాని అనాదిగా వస్తున్న ఆచారమని కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకు వచ్చి వంశోద్దరణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు.

దృతరాష్ట్రుడు పాండురాజు విదురుల జననం :


భీష్ముని సలహా విన్న తరువాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. ఆవిషయం భీష్మునకు చెప్పింది. వ్యాసుడు సమస్త ధర్మాలూ తెలిసిన వాడు. మహాతపశ్శాలి వేదవేదాంగ పారంగతుడు అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది. ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్ధించింది. వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు. 

సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవర న్యాయం అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్దరణ చేయమని కోరింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తానని మాటిచ్చాడు. ముందుగా పెద్దకోడలైన అంబికను వ్యాసుని వద్దకు పంపగా ఆమె సన్నని నల్లని జఠలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు గుడ్డిగా పుట్టాడు. అతడే ధృతరాష్ట్రుడు .

రెండవ రోజు రెండవ కోడలయిన అంబాలికను పంపగా ఆమె వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు పాండు వర్ణంతో కుమారుడు కలిగాడు. అంబికకు గుడ్డి వాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా అందుకు ఆమె మనసు సమ్మతించక తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. 

ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు. అతడే విదురుడు.అది విన్న జనమేజయుడు మాండవ్య ముని యమధర్మ రాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు.

మాండవ్యముని వృత్తాంతం:


మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. 

వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు అని ప్రశ్నించారు.

అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరువాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

 ఆ తరువాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. 

వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు. 


సంబంధించిన సమాచారం కోసం :

ఆదిపర్వము - ప్రథమాశ్వాసము

ఆది పర్వము - ద్వితీయాశ్వాసము

ఆది పర్వము - తృతీయాశ్వాసము

ఆది పర్వము: చతుర్థాశ్వాసము

ఆది పర్వము: పంచమాశ్వాసము

ఆది పర్వము: షష్టమాశ్వాసము

ఆది పర్వము: సప్తమాశ్వాసము

ఆది పర్వము: అష్టమాశ్వాసము

Note: ఈ ఛానెల్‌లోని కంటెంట్ నా స్వంతది కాదు. ఇది ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఈ కంటెంట్ యొక్క అసలైన రచయితలకు మరియు మూలాల‌కు నా గౌరవం వహిస్తున్నాను.


About Admin

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment