అంగారపర్ణుడు :
ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్ధం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంగారపర్ణుడు అనే గంధర్వుడు మానవులారా ఇది రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయం.
ఈ వేళలో మానవులకు తిరగడం ఉచితము కాదు. ఇది నా ఆధీనంలో ఉన్న భూమి ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలౌతారు. మీరు వెళ్ళక పోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు అన్నాడు. అర్జునుడు నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది. మా వంటి వీరులకు కాదు పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి స్వంతం కాదు.
భూమి మీది జల వనరులు అందరి స్వంతం అని అంగారపర్ణునితో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పటమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునినిపై పదునైన బాణాలు వేసాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకుని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రధాన్ని బుగ్గి చేసాడు.
నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళాడు. ధర్మరాజు అర్జునా ఓడి పోయిన వారిని, శౌర్యం కోల్పోయిన వారిని, శిక్షించ రాదు కనుక అతనిని విడిచి పెట్టు అన్నాడు.
అర్జున అంగారుపర్ణుల స్నేహము :
అంగారపర్ణుడు అర్జునా నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నీకు చాక్షుసీ విద్యను, మహా వేగం కలిగిన గుర్రాలను ఇస్తాను నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం నాకు ఇవ్వు అన్నాడు. అర్జునుడు గంధర్వా మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను.
నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు. అర్జునుడు గంధర్వునితో ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు అర్జునా ! ఆడవారితో ఉన్న వాడు వివేకం కోల్పోవడం సహజం కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మా ధర్మ విచక్షణ చేస్తాడు. తాపత్యా ! మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు.
అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకొండి అని చెప్పాడు. అర్జునుడు మిత్రమా ! మేము కుంతీ పుత్రులమైన మేము తాపశ్యులము ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు. అంగారపర్ణుడు ఇలా చెప్పాడు అర్జునా ! సూర్యుని కూతురుకు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య మహా సౌందర్యవతి. ఆజాఘీడుని కొడుకు సంవర్ణుడు. అతడు సూర్యుని గురించి తపసు చేసాడు.
తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒక రోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడ నుండి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చి వాడిలా తిరుగుతున్న సంవర్ణునిని చూసి అతని బాధను అర్ధం చేసుకుని తాను కన్యనని స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది.
ఒక రోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్టూడు సూర్యుని వద్దకు వెళ్ళి పూరు వంశస్తుడు, ధర్మపరుడు, సత్గుణ సంపన్నుడైన సంవర్ణునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు.
సూర్యుడు తన కోరిక తీరు తున్నందుకు సంతోషించి తపతిని వశిష్టునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికి వివాహం చేసాడు. వారికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కనుక మిమ్మల్ని తపత్యా అని పిలిచాను అని చెప్పాడు.
వశిష్ఠుడు :
అర్జునుడు అంగారపర్ణుని చూసి గంధర్వా ! మా పూర్వులకు గురువు పురోహితు డైన వశిష్టుడిని గురించి వినాలని ఉంది అడిగాడు. అంగార పర్ణుడు అర్జునితో ఇలా చెప్ప సాగాడు. అర్జినా ! పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనేరాజు పాలిస్తున్నాడు.
ఒక రోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసి పోయి వశిష్టుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర కుశలం విచారించుకున్న తరువాత వశిష్టుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు. నందినీ అనే కామధేనువు సాయంతో అపార సేనావాహినితో సహా విశ్వా మిత్రునకు వశిష్ఠుడు షడ్రశోపేత మైన విందు భోజనం పెట్టాడు. అది విశ్వామిత్రుని ఆశ్చర్యచకితుని చేసింది.
అలాంటి ధేనువు తన వద్ద ఉండటం ఉచిత మని ఎంచి వశిష్టుని వద్దకు వెళ్ళి ఆధేనువును ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకు వెళతానని బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళాడు.
తిరిగి వశిష్టుడిని చేరిన నందినీ తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షాత్ర బలం కటే తపో బలం గొప్పదని తెలుసుకుని రాజ్యాన్ని విడిచి పెట్టి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు.
విశ్వామిత్రుడి మత్సరం:
తపస్సు వలన దివ్యశక్తులు సాధించినా విశ్వామిత్రునికి వశిష్టునిపై మత్సరం పోలేదు. వశిష్ఠుడు కల్మషపాదునికి యాజకుడుగా చేస్తున్నాడు. విశ్వామిత్రునకు కూడా కల్మషపాదునికి యాజకునిగా ఉండాలని ఉండేది. ఒక రోజు కల్మషపాదుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్టుని పెద్ద కుమారుడు శక్తిముని ఎదురు పడ్డాడు.
రాజు శక్తితో ! పక్కకు తొలగి నాకు దారి ఇవ్వు అని అడిగాడు. శక్తి మహారాజా ! ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురైతే ముందుగా తొలగి దారి ఇవ్వడం ధర్మం అని చెప్పాడు. రాజు ఆగ్రహించి చేతి కర్రతో శక్తిని కొట్టాడు. శక్తి కోపించి రాజా ! రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై నరమాంస భక్షకుడివైపో అని శపించాడు. అప్పుడు కళ్ళు తెరచిన కల్మషపాదుడు శాపవిమోచనం ఇవ్వమని వేడు కున్నాడు.
దూరంగా ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు కల్మషపాదునిలో కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మషపాదుడు రాచకార్యాలు మానివేసాడు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తరవార మరచి పోయినా రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు.
వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు రాజు ఆవేశంతో నరమాంసం అయినా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. తాను తిన్నది నరమాంసం అని గ్రహించిన బ్రాహ్మణుడు కల్మషపాదుని చూసి నాచేత నరమాంసం భుజింప చేసావు కనుక నీవు రాక్షసుడవై నరమాంసం తింటూ జీవించు అని శపించాడు. కల్మషపాదుడు వెంటనే రాక్షసుడైనాడు.
వెంటనే శక్తి దగ్గరకు వెళ్ళి దీనికంతా కారణం నీవే కనుక ముందు నిన్నే భక్షిస్తాను అని చెప్పి అతనితో చేరి వశిష్టుని నూరుగురు కుమారులను భక్షించాడు.
వశిష్టుడి ఆత్మహత్యా ప్రయత్నము:
తన నూరుగురు కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడ పోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు. వశిష్ఠుడు మనుమని చూడాలని ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు.
ఒక రోజు కల్మషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్ర జలం చల్లాడు. వెంటనే కల్మషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడు అ య్యాడు. వశిష్ఠుడు కల్మషపాదునితో బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్ధం తెలుసింది కదా ఇక మీదట బ్రాహ్మణులను పూజించు అని హితభోధ చేసాడు.
రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మాషపాదుడు ప్రణయకాలాపం లో ఉన్న బ్రాణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య కోపించి ప్రణయకాలాపంలో ఉన్న నా భర్తను చంపావు కనుక నీవు స్త్రీతో ప్రణయకాలాపం చేస్తే మరణిస్తావు అని శపించింది. అందువలన కల్మాషపాదుడు సంతానం పొందలేక పోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్టుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు.
వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మాషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. పన్నెండేళ్ళు గడచినా ప్రసవం కానందున ఆమె పదునన రాతితో గర్భాన్ని చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు.
అదే సమయంలో శక్తి భార్య అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. అతడు తల్లి వలన తన తండ్రిని ఒక రాక్షసుని వలన మరణించాడని విని ఆగ్రహం చెంది లోకాలను భస్మం చేస్తానని శపధం చేసాడు. అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు.
ఔర్యుడు:
పరాశరుని కోపము చూసి అతడి తాత వశిష్ఠుడు పరాశరా ! అకారణంగా అందరిని హరించడం తగదు. పూర్వం కృతవీర్యుడు భృగువంశ వంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను చేసాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు.
కొంత కాలానికి కొంత మంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దాచుకున్నారు అని అపప్రధ పుట్టించారు. అది విని కొంత మంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంత మంది ధనాన్ని భూమిలో పాతి పెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తీసుకు వెళ్ళారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపి వేసారు. స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు.
అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తోడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుండి తేజో వంతుడైన ఔర్యుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అంధులయ్యారు. ఔర్యుడు త తండ్రితో సహా బంధులందరిని చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చేయటానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు. ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై మేము అసమర్ధులమై క్షత్రియుల చేతిలో మరణించ లేదు. ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు.
మేము గొప్పగా తపస్సు చేయడం వలన మాకు మరణం రాలేదు. ఆత్మ హత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చేయలేక పోయాము. ఈ మనుష్య లోకంలో అధిక కాలం ఉండలేము. కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకుని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము. కనుక నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు.
0 comments :
Post a Comment